ఒప్పుకోలుకై తపిస్తూ....
ఒప్పుకోలుకై తపిస్తూ
,,,,,,,,,,,,,,,,,,
ఆశలచిగుర్లపై
తిరస్కారం
విదిల్చిపోయిన
మట్టిమేటను తొలగిస్తూ...
అక్షరాల్నే మళ్ళీమళ్ళీ
విత్తుతున్నా..
ఒప్పుకోలు కై తపిస్తూ..
మొలకెత్తుతున్నపంటఒకటైనా
సముద్రంపై నడుస్తున్న ఓడనెక్కితే
సరుకుతో మెరుస్తున్న నిండైననడుమింటిని
శీర్షికై ఓడపైన
ఎగురుతున్నపతాకాన్ని
ఒడ్డునుండి చూడాలని
ఊహిస్తూ ..ఆశిస్తూ
అక్షరాల్నే మళ్ళీమళ్ళీ
విత్తుతున్నా...తపిస్తూ...
నెత్తిమండితేనే
విత్తనమందేది
అదేమిటో కానీ...
పొత్తులమత్తులతంటాల్తో..
ఉత్తుత్తివిత్తనాల తాలే పంటల్లా
నిండుగర్భిణులకడుపుల్లా
తిండికిపెరిగినబొజ్జలతో
అర్థంలేనిజెండాలెగరేసుకుంటూ
ఓడల్లోకెక్కుతూంటే
సముద్రం వ్యర్థాల్నెటకో చేరవేస్తోంది.
బాధపడుతూనే చూస్తున్నా
అయినా...
వివిధవస్తుసమస్తాలతో
కనిపిస్తున్న ఒక్క ఓడయే
సముద్రానికి గర్వకారణం!!
ఓడనిండా గట్టిసరుకే
పతాకలన్నీ మణిశలాకలే!!
మామూలోడి సరుకుబాగున్నా
ఓడెక్కాలంటే తావుండాలి
ప్చ్ ....
పేరుమోసినవారిసరుకో
పుట్టుకోచావోసందడో
పక్కకునెడుతోంది
దురదృష్టపు రాకాసి అలలా..
అయినా
పుఱ్ఱెలపగుళ్ళలోంచి
ఆశలచిగుర్లొస్తున్నాయ్
నిరాశనుచీల్చుకుంటూ
అక్షరాల్నే మళ్ళీమళ్ళీ
విత్తుతున్నా ఆశగా
దింపుడుకల్లం సాక్షిగా
గాదిరాజు మధుసూదనరాజు
Comments
Post a Comment